మన శరీరంలోని అవయవాలు ఒకదాని పనితీరుపై మరోటి ఆధారపడివుంటాయి. అందుకే అన్ని రకాల వ్యాధుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మానవదేహంలో అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయంలో తయారయ్యే బైలురుబిన్ అధికంగా రక్తంలోకి విడుదలైనప్పుడు కళ్లు, చర్మం, గోర్లు పచ్చగా కనిపిస్తాయి. శరీర ద్రవాలన్నింటిలోనూ బైలురుబిన్ స్థాయులు పెరుగుతాయి. ఈ పరిస్థితిని పచ్చ కామెర్లు అంటారు. కామెర్లు సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా కోలుకోవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం సంభవిస్తుంది. అయితే, తాజాగా పరిశోధకులు కామెర్ల వ్యాధి గురించి కీలక అంశాలను వెల్లడించారు. ప్రమాదకరమైన పేంక్రియాటిక్ క్యాన్సర్ కు కామెర్ల వ్యాధి కూడా ఓ సంకేతం అని పేర్కొన్నారు. పేంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడిన వారిలో తొలిదశలో కామెర్లు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
సాధారణంగా పేంక్రియాటిక్ క్యాన్సర్ ఎంతో అరుదైనది, అదే సమయంలో ప్రాణాంతకమైనది. పేంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడంలో మూత్రం రంగు కూడా కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం ముదురు గోధుమ రంగులో కనిపిస్తే అనుమానించాల్సిందేనట. రక్తంలో అధికస్థాయిలో ఉండే బైలురుబిన్ మూత్రంలోనూ చేరుతుందని, తద్వారా అది కామెర్ల వ్యాధి లక్షణంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు వివరించారు. పేంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ దశ ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మేలన్నది నిపుణుల అభిప్రాయం. మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. పేంక్రియాస్ నుంచే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. పేంక్రియాస్ లో కలిగే మార్పుల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ పరిస్థితినే మధుమేహం అంటారు.