అచ్యుతాపురం- పూడిమడక ప్రధాన రహదారిలోని కోనెంపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది మహిళా ఉద్యోగులు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సెజ్‌లో గల ఒక దుస్తుల కర్మాగారానికి సెకండ్ షిఫ్ట్‌నకు ఉద్యోగులను తీసుకువెళ్తున్న బస్సును కోనెంపాలెం వద్ద ఉద్యోగుల్ని ఎక్కించుకునేందుకు డ్రైవర్ ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో బస్సు ఆగి ఉన్న ఈ బస్సును బలంగా ఢీకొంది. దీంతో ఇరు బస్సుల్లో ఉన్న 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఢీకొట్టిన బస్సు డ్రైవర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. అతనిని బస్సుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు స్థానికులు అతికష్టమ్మీద బయటకు తీశారు. అతడి కాలుకు గాయమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ఈ ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు.