శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యాలయ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న గురువారం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఉభయ దేవాలయాల అర్చకులతోపాటు పలుగురు ధర్మకర్తల మండలి సభ్యులు సమావేశమయ్యారు. ముందుగా సమావేశంలో ఈవో మాట్లాడుతూ భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, పారిశుధ్యం, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, పర్వదినాలలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం మొదలైన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా పర్వదినాలు, రద్దీ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు, అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.