బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. వీసా పరిమితి దాటిన తర్వాత కూడా చాలా మంది భారతీయులు బ్రిటన్‌లోనే ఉంటున్నారని, గతేడాది ఇరుదేశాల మధ్య ప్రారంభమైన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ (ఎంఎంపి) సరిగా పనిచేయడం లేదని బ్రిటన్ మంత్రి గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఎంఎంపి కింద విస్తృత చర్చల్లో భాగంగా బ్రిటన్‌లో వీసా గడువు దాటిన భారతీయ పౌరులను తిరిగి వచ్చేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇండియన్ హై కమషన్ తెలిపింది. ఈ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని హై కమిషన్ పేర్కొంది. అలాగే బ్రిటన్ సహకారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.
ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ హైకమిషన్ స్పందిస్తూ.. 'మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసంగా ఉండకపోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకంగా ఉంటుందని భావిస్తున్నామని వెల్లడించింది. బ్రిటన్ తన వాగ్దానాల అమల్లో పురోగతి సాధించాలని ఎదురుచూస్తోందని తెలిపింది. భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ గత నెల బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.