భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా , ‘ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గం. విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో గురువారం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు మండలం బోడబండ నుంచి మంత్రాలయం మండలం కల్లుదేవకుంట వరకు కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు 26 మంది రాహుల్‌ను కలిశారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని ఆలోచించడం దారుణమని రాహుల్ అన్నారు. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా.. అవసరమైతే కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటానని రాహుల్ హామీ ఇచ్చినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్య రామయ్య మీడియా తెలిపారు.