ఎంఐఎం పార్టీ అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న జరగనున్న బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది.
పార్టీ అధినేత మంగళవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిజాబ్ గురించి ప్రస్తావించారు. హిజాబ్ ధరించిన ఓ ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఇదే విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ పలు మార్లు పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ను ఉద్దేశించి కౌంటర్ ప్రశ్నవేస్తూ విరుచుకుపడ్డారు.