విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలంటూ అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించిన నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారం నాటికి 1055వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి రైతులు, మహిళలు, కూలీలు మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తే కనీస గౌరవం లేకుండా నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి, మళ్లీ మూడుపాట పాడుతున్నారని అందుకే పాదయాత్ర చేపట్టామన్నారు. అమరావతి ఆవశ్యకతను ఐదు కోట్ల మంది గుర్తించినా అధికార పార్టీ మూడు రాజధానుల పేరిట ప్రదర్శనలు చేయించడం సిగ్గుచేటన్నారు. రాజధాని 29 గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.