రాష్ట్రంలో ప్రజాసంక్షేమ కోసం అభివృద్ధి పనులు చేపట్టకుండా, విద్యుత్తు, నిత్యావసరుకుల ధరలు పెంచి పేదప్రజల నడ్డివిరిచారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు విమర్శించారు. ఎర్రగొండపాలెం మండలంలో వెంకటాద్రిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే, బాదుడు కార్యక్రమం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అటవీ ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు, అడవిలో ఉన్న గిరిజనులకు పనులు కల్పించేందుకు అటవీ నిధులతో పనులు కల్పించారన్నారు. అటవీ ప్రాంత గూడెంలో పనులు లేక జీవనం ప్రశ్నార్థకమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా టీడీపీ ప్రభుత్వం రాయితీ రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాలకు ఇన్‌పుట్ రాయితీ ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు రాయితీ పథకాలను నిలిపేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాలని చంద్రబాబునాయుడిని 2024 లో ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.