పంజాబ్ ఎన్నికల ముందు ప్రారంభమైన వివాదాల పరంపర ఆమ్ ఆద్మీ పార్టీని వెంటాడుతూనే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్, జైళ్ల శాఖ మాజీ డీజీపీ సందీప్ గోయల్ నుంచి తనకు ప్రాణ భయం ఉందని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ ఇద్దరి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. ఓ ఆర్థిక నేరం కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్న సుకేశ్.. సత్యేంద్ర జైన్ విషయంలో వీకే సక్సేనాకు లేఖ రాయడం ఇది మూడోసారి.
గతంలో తాను తీహార్ జైల్లో ఉన్న సమయంలో సత్యేంద్ర జైన్, సందీప్ గోయల్ తన నుంచి రూ. పది కోట్ల రూపాయలు వసూలు చేశారని ఇది వరకు రాసిన లేఖలో సుకేశ్ ఆరోపించాడు. జైల్లో తనకు రక్షణ కల్పించేందుకు ఈ ఇద్దరూ పెద్ద మొత్తం కాజేశారన్నాడు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రూ. 50 కోట్ల దాకా విరాళంగా ఇచ్చానని, ఇందుకు ప్రతిఫలంగా తనకు రాజ్యసభ సీటు ఇప్పిస్తానని సత్యేంద్ర హామీ కూడా ఇచ్చారని సుకేశ్ పేర్కొన్నాడు. ఈ విషయాలను వెల్లడించిన తర్వాత సత్యేంద్ర, సందీప్ గోయల్ నుంచి తనకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను సుకేశ్ కోరాడు. ఒకసారి సీబీఐ దర్యాప్తు మొదలుపెడితే.. ఆప్ అసలు రూపాన్ని బయటపెడతానని లేఖలో పేర్కొన్నాడు. ‘ఈ విషయం ఒక్క సత్యేంద్ర జైన్ గురించి మాత్రమే కాదు. జరిగిన అన్ని ఎపిసోడ్స్ లో అరవింద్ కేజ్రీవాల్, కైలాష్ గెహ్లాట్ కూడా భాగమే. ఇందులో కంటికి కనిపించే దానికంటే చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి’ అని సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు.