టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. తన క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 467 నమోదు చేశారని... ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్న తరపు
న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు సీఐడీ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... అయ్యన్నపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని... అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో సెక్షన్ 467 వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు సీఆర్పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి సీఐడీ విచారణ జరుపుకోవచ్చని తెలిపింది.