రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కావాల్సింది నలభై ఏళ్ళ అనుభవం కాదు, మంచి మనసు...పట్టుదల, ఇవి మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.... వైద్య, ఆరోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం, అంతేకాదు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా ముందువరసలో ఉన్నాం, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఐటీసీ సంస్ధ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఐటీసీ సంస్ధ రైతుల కోసం ఇతర రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన పథకాలను ఇక్కడ కూడా ప్రారంభించాలని వారిని కోరుతున్నా, ఐటీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య రానున్న రోజుల్లో మరింత బలమైన బంధం ఏర్పడుతుందని భావిస్తున్నాను. సీఎంగారు పేదరిక నిర్మూలన, నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని తెలియజేసారు.