తన అనుకూల మీడియానే లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబు అనే వ్యక్తే ఉండేవాడు కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి రజిని మాట్లాడుతూ పేద ప్రజలకు మేలు జరుగుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు, పచ్చ మీడియా ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగనన్న చిరస్థాయిగా వారి హృదయాల్లో నిలిచిపోతారనే అక్కసుతోనే విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ఖర్చు చేసింది 11వేల కోట్ల రూపాయలే అయితే... ఏకంగా రూ.15వేల కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుందో పవన్కళ్యాణ్ చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.