అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కారణంగానే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, పాదయాత్రలో ఆక్వా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం, సబ్సిడీ ద్వారా రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తున్న ఈ ప్రభుత్వంపై టీడీపీ పనిగట్టుకుని బురదచల్లుతుందని ధ్వజమెత్తారు. గతంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులుకు కొమ్ముకాసిన టీడీపీ.. ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. గడిచిన మూడేళ్ళలో విద్యుత్ సబ్సిడీ ద్వారా రూ. 2,377 కోట్లు ప్రభుత్వం అందించిందని వివరించారు. కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థలకు మినహా, నిజమైన 86 శాతం మంది రైతులకు విద్యుత్ సబ్సిడీ అందుతోందని చెప్పారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సిండికేట్ దారులంతా చంద్రబాబు శిష్యులేనని, ఇందులో ఆయన కుట్ర కూడా ఉందని తెలిపారు. కొవిడ్ సమయంలోనూ ప్రభుత్వం ఆక్వా రైతాంగానికి అండగా అండగా నిలిచిందని ప్రసాదరాజు గుర్తు చేశారు.