వికేంద్రీకరణ నినాదం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మార్మోగుతోంది. అందరి నోటా మూడు రాజధానులే ముద్దు అన్న మాటలే వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఉండాలన్న అంశంపై రాష్ట్రస్థాయిలో రెఫరెండంకు తాము సిద్ధమన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని టిడిపికి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. తమ పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఇప్పటికీ వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని మరింత వెనక్కి నెట్టేందుకు టీడీపీ, జనసేనలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే టీడీపీ, జనసేనలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.