ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హత ఉంటే చాలు కుల మత రాజకీయాలకు అతీతంగా పథకాలు వర్తింప చేస్తుందని అనడానికి ఉర్లాంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచిందని స్థానిక వైసీపీ నేతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందుకుంటున్నారని చెప్పారు. గురువారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించి సంక్షేమ బుక్ లేట్ను ఆయనకు అందజేశారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38, 500, సున్నా వడ్డీ కింద రూ. 1, 168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11, 640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు.