బాదుడే బాదుడు తరహాలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నాయకులకు ఆపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. సీనియర్ నాయకులు, యువ నాయకులను ప్రోత్సహించాలే తప్ప ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పలు అంశాలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులంతా హాజరైన ఈ సమావేశంలో జిల్లాలోని పార్టీ పరిస్థితులు, ఇతర కొన్ని అంశాలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకటి అరా మినహా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బాదుడేబాదుడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం డిసెంబరు 1 నుంచి రాష్ట్రానికి ఇదేం ఖర్మ అన్న కార్యక్రమాన్ని ఊరూరా నిర్వహించాలని సూచించారు.