ఏజెన్సీలో సుమారు 7,500 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశామని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తెలిపారు. బొబ్బిలి గ్రామీణ సర్కిల్ విభాగంలో శనివారం ఆయన స్టేషన్ తనిఖీతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి ఇతర మత్తుపదార్థాలేవీ రవాణా కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్‌స్టాపుల్లో గట్టి నిఘా పెట్టామని.. ఎస్.కోట, రామభద్రపురంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 32 కేసులకు సంబంధించి 79 మందిని అరెస్టు చేశామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి యువతకు ముఖ్యంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో పదివేల సదస్సులు నిర్వహించామన్నారు. గంజాయి రవాణా, వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్టు కూడా ప్రయోగిస్తున్నామన్నారు. మహిళా పోలీసు విభాగం పనితీరు చాలా సంతృప్తికరంగా ఉందన్నారు.