కదిరి, స్థానిక మైనార్టీ వసతి గృహంలో నిర్వహిస్తున్న ఎస్టీ హాస్టల్‌లో కండ్లకలక కలకలం రేపింది. ఏకంగా 130 మందికి సోకింది. మొత్తం 250 మంది విద్యార్థుల్లో సగానికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయినా.. ప్రిన్సిపాల్ వెంకటరమణనాయక్, హాస్టల్ వార్డెన దుర్గాప్రసాద్ పట్టించుకోకుండా కండ్లకలక సోకిన వారందరినీ ఓ గదిలో ఉంచారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు శనివారం హాస్టల్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు కండ్లకలక విపరీతంగా సోకిందని ఆరోపించారు. కనీసం వారిని ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని వాపోయారు. ధర్నా అనంతరం విద్యార్థి నాయకులే దగ్గరుండి.. విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థులను టీడీపీ మైనార్టీ విభాగ నేత పర్వీనాభాను పరామర్శించారు.