సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా, రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒక పెద్ద జోకర్ అని అభివర్ణించారు. అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై నేడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.
ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.