సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడం వల్లనే ఆమెను హత్య చేసినట్లు ఆఫ్తాబ్ చెప్పాడని పోలీసులు తెలిపారు. తరచూ వేధించడం, శారీరకంగా హింసించడంతో విసుగెత్తిన శ్రద్ధా అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది. తనను రిజెక్ట్ చేయడాన్ని ఆఫ్తాబ్ సహించలేకపోయాడు. ఇంటి ఖర్చులు, పెళ్లి విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మే 18న గొడవ తీవ్రతరం కావడంతో క్షణికావేశంలో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఈ హత్యను పక్కా ప్లాన్‌తోనే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.