టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి భానుమతి మరణం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. కీరవాణి మాతృమూర్తి భానుమతి కన్నుమూశారని తెలిసి చింతించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భానుమతి గారి భర్త శివశక్తి దత్తా, ఆమె కుమారుడు కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వివరించారు.
శివశక్తి దత్తా, భానుమతి దంపతులకు ఆరుగురు సంతానం. అందరిలోకి కీరవాణి పెద్దవాడు కాగా, కల్యాణ్ కోడూరి, శ్వేతనాగ, మల్లీశ్వరి, కాంచి, సప్తమి ఇతర సంతానం. ఇదిలావుంటే భానుమతి అంత్యక్రియలు రేపు హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.