వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతోందని, ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలై, అడ్డదారులు తొక్కుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఉంగుటూరు టీడీపీ మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ మండల కమిటీ సోమవారం గారపాడులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ గ్రామ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కొత్త పరిశ్రమలు రప్పించడం టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. నాయకులు కుమ్మరి వెంకటేశ్వరరావు, కాటూరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, చింతయ్య, చిన్నబాబు, కృష్ణమోహన్, నాగరాజు, ప్రశాంత్, వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.