విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్లకు గురికావడం సహజమని, తరచూ వైద్యపరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులకు సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అధికారులతో కలిసి కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ అధికారి క్రమం తప్పకుండా షుగర్, బీపీ పరీక్షలను చేయించుకోవాలన్నారు. ఉదయం నడక, యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ప్రశాంతత చేకూరుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని, వైద్యులు పవన్‌వర్మ, సునీల్‌వర్మ ఆధ్వర్యంలో 150 మందికి పైగా అధికారులు అర్జీదారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.నుపూర్ అజయ్, డీఆర్‌వో కె.మోహనకుమార్‌లు పాల్గొన్నారు.