మోడీ , జగన్ చేసే మోసాలను ప్రజలు కూడా గమనించాలని సీపీఎం నేత శ్రీనివాసరావు కోరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయని తెలిపారు. ‘‘విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ అని వైసీపీ గొప్పగా చెప్పుకుంటుంది. దివాళా అంచున ఉన్న బైజూస్‌ను కాపాడేందుకు ట్యాబ్‌ల కాంట్రాక్టు ఇచ్చారు. బైజూస్ మంచి కంపెనీ అని విద్యావేత్తలు నిర్ధారించారా? వ్యాపార లావాదేవీలతో ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. ఆస్తి ప్రభుత్వానిదా... పెత్తనం మాత్రం బైజూస్‌దా? ఇదెక్కడి న్యాయం. ఏ సూత్రాల ప్రకారం ఈ ఒప్పందం చేశారో ప్రజలకు చెప్పాలి. తక్కువ ధరకు వచ్చిందని చెప్పడం ప్రజలను దగా చేయడమే. అమ్మ ఒడిపథకానికి ముందు డబ్బులు వేయాలి. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎటువంటి న్యాయం చేశారు. ముంపు బాధితులకు పూర్తిగా సహకారం అందించాలి. పోలవరం నిర్వాసితులకు ఆర్.ఆర్ ప్యాకేజీ ఇచ్చి పనులు చేసేలా చూడాలి. కేంద్రం.. ఏపీకి అన్యాయం చేస్తున్నా... కనీసం అడగలేని దుస్థితి లో జగన్ ఉన్నారు.’’ అని ధ్వజమెత్తారు.