సినీ పరిశ్రమలోె తనదైన ముద్రవేసుకొన్న సీయర్ నటుడు చలపతిరావు 78 ఏళ్ల వయసులో గుండె పోటుతో మృతి చెందారు. 1966లో 22 ఏళ్లకే చలపతిరావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన తొలి చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'గూఢచారి 116'. తన కెరీర్లో 1,200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగా 7 చిత్రాలను నిర్మించారు. తన 55 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రేక్షకులను ఎంతో అలరించిన చలపతిరావు నిజ జీవితంలో ఎంతో విషాదం ఉంది.
కొడుకు, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఆయన భార్య ఇందుమతి అగ్ని ప్రమాదంలో చనిపోయారు. చెన్నైలో ఉన్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లినప్పుడు ఆమె చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విన్న చలపతిరావు మంటలార్పారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందారు. ఆ తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు. తన ముగ్గురు పిల్లలకే జీవితం మొత్తాన్ని కేటాయించారు.