సంక్రాంతికి బస్సు ప్రయాణం మరింత భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి ప్రయాణాలకు ఇప్పటికీ టికెట్లు బుక్ చేసుకోలేదా..? వెంటనే ఆ సన్నాహాలేవో చేసుకోవడమే మంచిది. ఎందుకంటే దాదాపు అన్ని రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ ఒక్క రైలులోనూ కనీసం నించుని ప్రయాణించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ రైళ్లు అన్నింటిలోనూ వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. కనుక కన్ ఫర్మ్ అయ్యే అవకాశాలు లేనట్టే. కొన్ని రైళ్లలో రిగ్రెట్ కూడా (బుకింగ్ కు అవకాశం లేదు) అయింది.
ఈ పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మచిలీపట్నం-సికింద్రాబాద్, కాకినాడ-లింగంపల్లి, మచిలీపట్నం-తిరుపతి, మచిలీపట్నం-కర్నూలు, కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, విజయవాడ-నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కనుక ఈ మార్గాల్లో సంక్రాంతి ప్రయాణాలు పెట్టుకున్నవారు వెంటనే టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
ప్రయాణికుల రద్దీ భారీగా ఉంది. భారీ వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నా.. దక్షిణ మధ్య కేవలం కంటితుడుపుగా కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించడం అవసరాలను తీర్చేలా లేవు. పైగా సంక్రాంతికి రెండు మూడు రోజుల ముందు ప్రత్యేక రైళ్లు ఏవీ లేవు. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించినవన్నీ కూడా 1 నుంచి 7వ తేదీ మధ్య నడిచేవే ఉన్నాయి. టికెట్లు అందుబాటులో ఉంటే ఆర్టీసీలో లేదంటే, ప్రైవేటు ట్రావెల్స్ లో వెంటనే బుక్ చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో కంగారు లేకుండా ఉంటుంది.