సంతానం కలగలేదనే కోపంతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి కాలు, చేయి విరిచేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలతో ఉన్న కుమార్తెను తల్లితండ్రులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం పత్తికొండ మండలం చందోలికి చెందిన భవానీని డోన్ మండలం చనుగండ్లకు చెందిన రాముకు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం చేశారు. సంతానం లేకపోవడంతో భర్త, అత్తింటివారు తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని భవాని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం విచక్షణారహితంగా కొట్టి కాలు, చేయి విరిచేశారని తెలిపారు. చావు బతుకుల మధ్య ఉందని తెలియడంతో తాము వెళ్లి తమ కుమార్తెను తీసుకొచ్చామని వెల్లడించారు. భవాని పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలించారు. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.