గుజరాత్ లో నమోదైన ఓ కేసులో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఇదిలావుంటే చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్ లో గుర్తించారు. దీన్ని కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ గా పిలుస్తున్నారు.
అమెరికా వైద్య నిపుణులు కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 రకాన్ని సూపర్ వేరియంట్ అంటున్నారు. ఇది బీక్యూ.1 వేరియంట్ కంటే 120 రెట్లు అధికవేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇటీవల ఈ వేరియంట్ తో అమెరికాలో కొన్ని కరోనా కేసులు వెల్లడయ్యాయి.
చైనా సంతతి అమెరికా వైద్య నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ దీనిపై స్పందిస్తూ, కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఏమార్చే సామర్థం గలదని హెచ్చరించారు. కాగా, ఈ నయా వేరియంట్ ను గుర్తించిన 17 రోజుల వ్యవధిలోనే ఇది చాలామందికి వ్యాపించింది. ఒకప్పుడు కరోనా వైరస్ ను చైనా ఎలా దాచిపెట్టిందో, ఈ కొత్త వేరియంట్ ను అమెరికా కూడా దాచిపెట్టిందని ఎరిక్ ఫీగల్ డింగ్ ఆరోపించారు.
అమెరికాలో అక్టోబరులోనే ఇది వెలుగుచూసిందని, ఇప్పుడిది అమెరికా నగరాల్లో వేగంగా ప్రబలుతోందని వివరించారు. ఒమిక్రాన్ తో పోల్చితే ఇది భిన్నంగా ఉన్నందున దీనిపై ప్రభుత్వానికి అవగాహన లోపించిందని, ప్రజలను కూడా సరిగా హెచ్చరించలేకపోయిందని విమర్శించారు.