భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం సీతారాముల నిత్యకళ్యాణం కన్నులపండుగగా సాగింది. ఉదయమే పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చారు. ముందుగా భద్రాద్రి దివ్యక్షేత్ర మహత్యాన్ని అర్చకస్వాములు భక్తులకు తెలిపిన అనంతరం కళ్యాణ తంతును ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణతంతును కన్నులపండుగగా నిర్వహించారు. అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి నూతన వస్త్రాలు అక్షింతలు, ప్రసాదం వితరణ గావించారు.