రైతులవద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతులు జిల్లాలోని జగ్గంపేట-విశాఖపట్నం జాతీయ రహదారిని శుక్రవారం దిగ్బంధించారు. ధాన్యం లోడుతో ఐదురోజులుగా లారీలు జగ్గంపేట జేవీఆర్ సెంటర్‌వద్ద ఆగిపోయాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఐదు రోజులుగా రోడ్డుపై ఉంటున్నామని వివరించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నెహ్రూ ఆధ్వర్యంలో రైతులు లారీలతో జాతీయ రహదారి పైకి చేరుకున్నారు. 50లారీలను ఎన్‌హెచ్‌పైకి తీసుకొచ్చారు. అనంతరం ఆందోళన చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు నిలిచిపోయింది. కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నెహ్రూతో చర్చలు జరిపారు. లారీలు, ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని స్థానిక లక్ష్మీనారాయణ రైసుమిల్లులో దిగుమతి చేస్తామని వారు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రంలోగా మొత్తం వాహనాల్లో ధాన్యాన్ని డౌన్‌లోడ్ చేస్తామన్నారు. ఈ హామీతో రైతులు ఆందోళన విరమించారు.