పండుగలను ప్రైవేటు ట్రావెల్స్ కాసుల పంటగా మార్చుకొంటున్నాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నాయి. టికెట్ ధరలను దాదాపుగా రెండు, మూడింతలు పెంచుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.వెయ్యి ఉండే టికెట్ ధర పండుగ సీజన్ కావడంతో రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా పెంచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.800 ఉన్న టికెట్ ధరను పండుగ రద్దీ నేపథ్యంలో రూ.2 వేలకు పెంచినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలకు, కర్ణాటకలోని బెంగళూరు తదితర నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వెయ్యి బస్సులు తిరుగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
పండుగ కారణంగా విశాఖ, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి నగరాలకు వెళ్లే బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు, ఫిట్ నెస్ లేని బస్సులు రోడ్డు మీదికి రాకుండా అడ్డుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హయత్‌నగర్-విజయవాడ హైవేపై..
హైదరాబాద్-విజయవాడ హైవే పై రవాణా శాఖ అధికారులు బుధవారం ట్రావెల్స్ బస్సుల తనిఖీలు మొదలుపెట్టారు. గురువారం కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను ఆపి చెక్ చేశారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ లేని 6 బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా, టికెట్ ధరలను పెంచి అమ్మడంపైనా దృష్టి పెట్టామని అధికారులు చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉందని టికెట్ ధరలు పెంచి అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.