కృష్ణా జల వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను కొనసాగించింది. శుక్రవారం నుంచి తామిద్దరం ఒకే ధర్మాసనంలో కూర్చోబోవడం లేదని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. దాంతో ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికే కేసును నివేదించాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తామని న్యాయవాదులు ప్రతిపాదించారు. అంగీకరించిన ధర్మాసనం.. తామిద్దరితో కూడిన ధర్మాసనానికే కేసును అప్పగిస్తే కర్ణాటక దరఖాస్తునే కాకుండా ప్రధాన కేసును కూడా పరిష్కరిస్తామని చెప్పింది. ప్రధాన కేసులో కూడా వాదనలు వినిపించడానికి సిద్ధం కావాలని న్యాయవాదులకు సూచించింది. నీటి లెక్కల్లో డిపెండబిలిటీ మీద అభ్యంతరాలు ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా స్పందిస్తూ... అదొక్కటే సమస్య అని తెలిపారు. నీటి లభ్యతపై మూడు రకాల డిపెండబిలిటీలతో తీర్పు ఇచ్చారని, దాని వల్ల ఏపీకి తీరని నష్టం జరగనుందని చెప్పారు.