పన్ను ఎగవేత కేసులో రికవరీ కోసం మహారాష్ట్ర సేల్స్ ట్యాక్స్ విభాగం ఇటీవల బాలీవుడ్ నటి, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై అనుష్క న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఓ నటిగా అనేక సినిమా ఈవెంట్లలో, అవార్డు కార్యక్రమాల్లో, ఫంక్షన్లలో కనిపిస్తానని, అంతమాత్రాన నిర్మాతలకు విధించే స్లాబుల్లోనే తనపైనా పన్నులు విధించడం సరికాదని అనుష్క శర్మ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. నిర్మాతల స్లాబుల్లో కాకుండా, నటులకు విధించే స్లాబుల్లో తనపై పన్నులు వేయాలని కోర్టును కోరింది.
ఇదిలావుంటే ఇదే వ్యవహారంలో అనుష్క గతంలో తన ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరైనా కన్సల్టెంట్ ద్వారా పిటిషన్ దాఖలు చేస్తారా? అని అనుష్కను ప్రశ్నించింది. నేరుగా పిటిషన్ వేయాలంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అనుష్క స్వయంగా పిటిషన్ దాఖలు చేసింది.