రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చేపడుతున్న బహిరంగ విచారణలో 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లోటును రూ. 13వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19వ తేదీన కడప నగరంలో ఉన్న విద్యుత్ భవన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్టు సీపీఎం పార్టీ కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ తెలియజేశారు. బుధవారం కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ నియంత్రణ మండలి ఈనెల 19 నుంచి 21 వరకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో బహిరంగ విచారణ చేపడుతోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీన కడప నగరంలోని విద్యుత్ భవన్ వద్ద జరిగే ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు పి చంద్రారెడ్డి, నగర కమిటీ సభ్యులు ఓబులేసు, పరుక్ హుస్సేన్ పాల్గొన్నారు.