గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశామని ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తమ సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.తామేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదని కేఆర్ సూర్యనారాయణ అన్నారు. తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము తీసుకుని నేటికీ చెల్లించలేదని, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల కోసం ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఆందోళనలు చేస్తాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వాడుకున్న సొమ్ములపై దర్యాప్తు కొనసాగుతోందని, స్టేటస్ తెలుసుకుని న్యాయ సలహాతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని కేఆర్ సూర్యనారాయణ అన్నారు.