ఆత్మకూరు మండల పరిధిలోని వైయస్సార్ స్మృతి వనం సమీపంలోని అటవీ ప్రాంతంలో నంద్యాల-ఆత్మకూరు ప్రధాన రహదారిపై ఓ పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ఆత్మకూరు నుంచి నంద్యాలకు వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్దపులి రోడ్డు దాటుతూ కనిపించడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. కాసేపు పెద్దపులి అక్కడే సంచరించి ఆ తర్వాత రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు వారు వెల్లడించారు. ఈ విషయం ఆత్మకూరు అటవీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.