ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేని ఆధారంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది

national |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 08:59 PM

ఆరోగ్య పర సమస్యలకు ఎలా ఉపయోగపడుతుందన్నది అన్ని విధాలా ఆలోచించి హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నాం.. మాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్..? చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ ఆలోచన తప్పు. సంపన్నులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇది తప్పకుండా ఉండాలి. ఆర్థికంగా సమస్యల పాలు కాకుండా ఇది ఆదుకుంటుంది. 2020లో ఏం జరిగిందో ఓ సారి గుర్తు చేసుకోండి.


కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతతో ఉన్నవారు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితో.. రోజువారీ రూ.లక్షలు చొప్పున కార్పొరేట్ ఆసుపత్రులు బిల్లులు వడ్డించాయి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి ఎంతో మంది తమ ఆస్తులు అమ్ముకుని చెల్లింపులు చేయాల్సి వచ్చింది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే కొంత వరకైనా ఆదుకునేది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడమే కాదు, తగినంత కవరేజీ కూడా అవసరమని కరోనా ఉపద్రవం తెలియజేస్తోంది. అందుకే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాలి. అవివాహితులు కూడా ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకోవాలి. 


ఎంత కవరేజీకి తీసుకోవాలన్నది ముఖ్యమైన అంశం. ఒక్కరికి ఎంత లేదన్నా కనీసం రూ.10 లక్షల కవరేజీ తీసుకోవాలి. వయసులో ఉన్న వారికి అంత కవరేజీ ఎందుకు? ఆరోగ్యంగా ఉన్న వారికి అంత అక్కర్లేదులే? ఇలాంటి వాదనలు పక్కన పెట్టాలి. ఎందుకంటే వైద్య చికిత్సల వ్యయాలు ఏటేటా 12-14 శాతం స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు రూ.4-5 లక్షలు అయ్యే సర్జరీకి పదేళ్ల తర్వాత రూ.10-12 లక్షలు అవుతుంది. అప్పుడు కవరేజీ పెంచమంటే కంపెనీలు అధిక ప్రీమియం విధిస్తాయి. అందుకే ముందు నుంచే తగినంత కవరేజీ ఉండాలి. 


కుటుంబం మొత్తానికి కలిపి తీసుకునే వారు రూ.10-20 లక్షల బేసిక్ కవరేజీ తీసుకుని, దీనికి సూపర్ టాప్ రూపంలో అదనపు కవరేజీ జోడించుకోవాలి. బేసిక్ ప్లాన్ రూ.10 లక్షలకు తీసుకుని, సూపర్ టాపప్ రూ.50 లక్షలకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు హాస్పిటల్ లో బిల్లు రూ.15 లక్షలు వచ్చిందనుకుంటే బేసిక్ ప్లాన్ కింద రూ.10 లక్షలు పోను అదనపు మొత్తాన్ని సూపర్ టాపప్ ఇచ్చిన బీమా సంస్థ చెల్లిస్తుంది. కాకపోతే ఇలా కవరేజీని వేరు చేయడం వల్ల ప్రీమియం భారం తగ్గుతుంది.


హెల్త్ ఇన్సూరెన్స్ లో తప్పకుండా చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. రూమ్ రెంట్ కు పరిమితులు లేకుండా చూసుకోవాలి. రూమ్ రెంట్ పరిమితి ఉంటే, ఆ పరిమితికి మించిన వసతి పొందినప్పుడు అయ్యే చికిత్సా వ్యయాలకు బీమా సంస్థలు పూర్తి మొత్తం చెల్లించవు. పాలసీదారు కూడా కొంత భరించాలి. అందుకే రూమ్ రెంట్ పరిమితులు ఉండకూడదు. అంతేకాదు ఐసీయూ, వ్యాధుల వారీగా ఉప పరిమితులు ఉండకూడదు. అలాగే, కోపే లేకుండా చూసుకోవాలి. కోపే అంటే ప్రతీ క్లెయిమ్ లో పాలసీదారు కొంత మేర చెల్లించేది. అది పోను మిగిలినది బీమా సంస్థలు చెల్లిస్తాయి. 


నేడు వైద్య రంగం పురోగతి, టెక్నాలజీ ఫలితంగా కొన్ని చికిత్సలు ఆసుపత్రిలో చేరకుండానే తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని డే కేర్ చికిత్సలు అంటారు. అన్ని డే కేర్ చికిత్సలకు కవరేజీ ఉండాలి. కొన్ని చికిత్సలకు ఉప పరిమితులు ఉంటే ఆ ప్లాన్ తీసుకోకపోవడమే మంచిది. అలాగే, డోమిసిలరీ ట్రీట్ మెంట్ ఫీచర్ కూడా ఉండాలి. అంటే ఆసుపత్రిలో కాకుండా ఇంటి నుంచే చికిత్స తీసుకుంటే చెల్లింపులు చేసేది. ఆర్గాన్ డోనర్ కవరేజీ కూడా ఉండాలి. భవిష్యత్తులో అవయవ మార్పిడి చికిత్స అవసరం పడితే.. దాత నుంచి అవయవం సేకరణకు అయ్యే వ్యయాలను చెల్లించేది. వార్షికంగా హెల్త్ చెకప్ ఫీచర్ ఉంటే మంచిది. ఇది లేకుండా మిగిలిన అన్నీ ఉన్నా తీసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, సూపర్ బోనస్ ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. క్లెయిమ్ లేని సంవత్సరాల్లో కవరేజీ వీటితో పెరుగుతుంది. 


ఒక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దానికి బీమా క్లెయిమ్ వచ్చిందనుకుంటే.. ఆసుపత్రిలో చేరడానికి ముందు అయిన వ్యయాలు (ప్రీ హాస్పిటలైజేషన్), డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలు (పోస్ట్ హాస్పిటలైజేషన్) కవరేజీ కూడా ముఖ్యమే. 90-180 రోజుల వరకు ఇది ఉండేలా చూసుకోవాలి. ఇక రీస్టోరేషన్ కూడా ముఖ్యమైన ఫీచర్. అంటే ఒకరు ఆసుపత్రిలో చేరినప్పుడు వారు తీసుకున్న కవరేజీ మొత్తం అయిపోయిందనుకోండి. అప్పుడు బీమా కంపెనీ తిరిగి కవరేజీని పునరుద్ధరిస్తుంది. దీంతో అదే వ్యక్తి, లేదంటే కుటుంబంలో మరొకరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా అపరిమితంగా రీస్టోరేషన్ ను అందించే ప్లాన్లు కూడా వచ్చాయి. దీన్నే రీలోడ్, రీ ఇన్ స్టేట్ మెంట్, బంగీ రీఫిల్ ఇలా పలు పేర్లతో పిలుస్తున్నారు. 


అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ గా పరిగణిస్తారు. వీటి కోసం బీమా సంస్థలు 1-4 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నాయి. అంటే పాలసీ తీసుకుని ఈ వెయిటింగ్ పీరియిడ్ ముగిసిన తర్వాతే వాటికి కవరేజీ లభిస్తుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని ఆప్షనల్ కవరేజీ కింద అదనపు ప్రీమియం తీసుకుని వెయిటింగ్ లేకుండా ఆఫర్ చేస్తున్నాయి. ఇక కొన్నింటికి 24 నెలల తర్వాతే కవరేజీ లభిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com