మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డబ్బుల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు. గొంతు నులిమి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన గుత్తి పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు, తాడిపత్రి రోడ్డులోని మారుతి నగర్‌కు చెందిన షేక్ సయ్యద్ ఖాజా కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నంద్యాల జిల్లా డోన మండలం నక్కలాంపల్లి గ్రామానికి చెందిన నన్నేసాహెబ్ హుసేన పీరా కూతురు షేక్ జుబేదా(24)తో అతనికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటివల మద్యానికి బానిసైన ఖాజా.. భార్యను డబ్బులకోసం హింసిస్తున్నాడు. వేధింపులు అధికం కావడంతో ఇటీవల జుబేదా పుట్టింటికి వెళ్లి రూ.20 వేలు తేచ్చి భర్తకు ఇచ్చింది. ఇది చాలదని, కారు కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమెను కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తరువాత చీరను మెడకుచుట్టి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారులు రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మనవరాలి ద్వారా సమాచారం అందుకున్న జుబేదా తల్లిదండ్రులు, స్థానిక పోలీసులకు విషయం తెలియజేశారు. సీఐ వెంకటరామి రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖాజాపై హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.