ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో క్రొత్త విషయం బయటికి వస్తుంది . ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సైతం అరెస్ట్ చేసింది. నిన్న రాఘవరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు సాయంత్రానికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు అధికారికంగా ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు. నేడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు సమాచారం. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నుంచి పెద్ద వాళ్లను కూడా ఈడీ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.