ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసుపత్రిలో అర్ధరాత్రి శిశువు మృతి, ఆందోళనలో భాదితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:14 PM

పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి శిశువు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు తనకు న్యాయం జరిపించాలని వైద్యారోగ్య కమిషనర్‌, జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం ఈ సంఘటన పలాస-కాశీబుగ్గలో హాట్‌టాఫిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజాం సురేష్‌ అనే వ్యక్తి తన భార్య విజయకు నెలలు నిండడంతో సోమవారం రాత్రి 11.40 గంటల సమయంలో స్థానిక సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు ఆమెను డెలివరీ రూముకు తరలించారు. బిడ్డ అడ్డం తిరగడంతో పాటు పరిస్థితి మరింత విషమంగా మారింది. వైద్యాధికారి డాక్టర్‌ అశ్విని సెలవులో ఉండడంతో ఆమెకు విషయాన్ని తెలిపారు. అయితే గర్బిణీ పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని శరీరభాగాలు కూడా బయటకు కనిపిస్తున్నాయని చెప్పడంతో ఎనస్తీషియా తక్షణం అవసరంగా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్తీషియా వైద్యుడు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో సురేష్‌ కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు గుర్తించి తల్లిని అతికష్టంపై వైద్యసహాయం అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని సురేష్‌ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరంగా తీసుకువస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎంహెచ్‌వోతో పాటు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఎస్‌ఐ రమేష్‌ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్పందించారు. విచారణకు ఆదేశించారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నంనాయుడు స్పందించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. రాత్రి 11.30 గంటలకు వైద్యసేవల కోసం వచ్చారని.. సిబ్బంది తక్షణ సేవలు అందించారని చెప్పారు ఎనస్తీషియా వైద్యుడు లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడే శిశువు మృతిచెందినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa