ప్రత్యేక హోదా హామీ నీటిపై రాతగా మారిందని యువజన చైతన్య వేదిక సంస్థ అధ్యక్షుడు బెజవాడ నజీర్ విమర్శించారు. నజీర్ ఆధ్వర్యంలో ఆదివారం పటమట ఆర్ఆర్ గార్డెన్స్‌లో చైతన్య వేదిక సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు చర్యలతో సమయాన్ని వృథా చేస్తున్నాయని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హోదా అంశం మరుగన పడిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధించాలని, లేకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకులను ప్రజలు రోడ్లపై తిరగనివ్వబోరని నజీర్ హెచ్చరించారు.