అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, పోర్టులను ప్రభుత్వపరం చేయాలని శ్రీకాకుళం సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గసభ్యుడు బి.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ‘దేశానికి మోదాని ముప్పు’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంతకుముందు చరిత్రలో విదేశీ దురాక్రమణదారులను చూశామని, ఇప్పుడు ఏకంగా స్వదేశీ దురాక్రమణదారులను చూస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను సొంతం చేసుకోవడమే కాకుండా, విశాఖలో డేటా సెంటర్ పేరుతో 400 ఎకరాలను కారు చౌకగా గుంజుకు నేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోలార్ విద్యుత్ పేరుతో ప్ర భుత్వం వేలాది ఎకరాలను అదానీకి కట్టబెడుతోందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ కర్మాగారం, పంప్‌డ్ స్టోరేజి, హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రాని కి తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం అదానీకి అడిగిన చోటల్లా రాసి ఇస్తోందన్నారు. నిండా అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం, ఆస్తులను కూడా కోల్పోవడం తథ్యమని తెలిపారు. మన రాష్ట్రాన్ని అదానీ పీడ నుంచి తప్పించడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యుడు జి.సింహాచలం, జిల్లా కమిటీ సభ్యుడు కె.నాగమణి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa