కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం మధ్యాహ్నం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. పెద్ద ఇనుపరాడ్డును పట్టుకుని వాహనాలపై దాడికి దిగాడు. ఆర్టీసీ బస్సు, ఆ పక్కనే రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. ఆ తరువాత కేకలు వేస్తూ పోలీస్ స్టేషన్ గేటు తీసుకుని లోపలికి పరుగులు తీశాడు. ఆవరణలో ఉన్న పూలకుండీలను పగులకొట్టాడు. స్టేషన్ తలుపులు వేసి కేకలు వేస్తూ తిరిగి మళ్లీ గేటు వద్దకు వచ్చాడు. అదే సమయంలో స్టేషన్లోకి మఫ్టీలో వస్తున్న కానిస్టేబుళ్లు అతడిని పట్టుకొని లాకప్‌లో వేశారు. ఈ ఘటనతో జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. సైకో వీరంగానికి 10నిమిషాల పాటు ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.