ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్రేయపురంలో బంగారు పూతరేకులు,,,ఒక్కో పూతరేకు ధర తెలిస్తే అవాక్కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2023, 09:17 PM

పూతరేకులు అంటే స్వీటు ప్రియులకు తెలియకవుండదు.  గోదావరి జిల్లాల పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది పూతరేకు. అందులోనూ ఆత్రేయపురం పూతరేకు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పూతరేకుకు ఓ ప్రత్యేకత ఉంది.. గోదావరి ప్రాంతానికి ఓ గుర్తింపును తెచ్చి పెట్టింది. అలాంటి పూతరేకకు మరింత హైప్ పేంచేలా ఆత్రేయపురంలో ఓ స్వీట్ షాపు యజమాని వినూత్నమైన ఆలోచన చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు పూతరేకులు తయారు చేసి వావ్ అనిపిస్తున్నారు.


అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంటిమెంట్.. అలా బంగారాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి వచ్చినట్లే అని భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూనే బంగారు పూతరేకుల్ని తయారు చేశారు స్వీట్ షాప్ నిర్వహించే సాయిగణేష్‌. కాస్త వినూత్నంగా 24 క్యారెట్‌ ఎడిబుల్‌ గోల్డ్‌ తో ఈ పూతరేకులు తయారు చేశారు. అది కూడా కేవలం నాలుగు బాక్సులు మాత్రమే తయారు చేయగా.. వెంటనే ఓ కస్టమర్ వీటిని కొనుగోలు చేసినట్లు చప్పారు. ఆయన ద్వారా ఈ గోల్డ్ పూతరేకులు కూడా ఫేమస్ అయ్యాయి అంటున్నారు.


ఒక్కో బంగారు పూతరేకు ధర ఏకంగా రూ.800 అట. సాధారణంగా పూత రేకుల ధర డిమాండ్‌ను బట్టి రూ.100 వరకు ఉంటుంది.. కానీ ఈ గోల్డ్ పూతరేకులు మాత్రం కాస్ట్లీ గురూ అంటున్నారు. వీటికి హైప్ రావడంతో ఆర్డర్స్ కూడా వస్తున్నాయంటున్నారు. ఇకపై ఆర్డర్స్ తీసుకుని.. ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారట. ఆత్రేయపురం రూట్‌లో లల్ల లాకుల వద్ద ఉండే షాపులో అందుబాటులో ఉంటాయట. ఎవరికైనా ఆసక్తి ఉంటే వచ్చే నెల నుంచి ఆర్డర్స్ తీసుకుంటారట. ఇంకెందుకు ఆలస్యం మీకూ కావాలంటే ఆర్డర్ చేయొచ్చు.


అంతేకాదండోయ్ ఆత్రేయపురం పూతరేకులకు వాణిజ్య పరిశ్రమల శాఖ జారీ చేసే భౌగోళిక గుర్తింపు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీఐ గుర్తింపు కోసం చేసుకున్న దరఖాస్తు చేసుకున్నారట. ఈ గుర్తింపుపై ఇప్పటికే ప్రకటన కూడా ఇచ్చారు. చెన్నైలో ఉండే జీఐ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఈ దరఖాస్తులను పరిశీలించి.. అభ్యంతరాల లేకపోతే జీఐను నమోదు చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులు, కళలు, ఆహార ఉత్పత్తుల గుర్తింపు కోసం ఇలా చేస్తుంది. పూతరేకులకు కూడా జీఐ వస్తుందని ధీమాతో ఉన్నారు. మొత్తానికి ఆత్రేయపురం పూతరేకు ఎన్నో ప్రత్యేకతల్ని చాటుకుంటోందనే చెప్పాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com