తెలుగు రాష్ట్రాల్లో పోస్టర్ రాజకీయాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఇదిలావుంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలంరేపాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి రాజకీయ ప్రవేశ చేస్తున్నట్లు స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ సునీతమ్మకు స్వాగతం అంటూ.. తెలుగుదేశం పార్టీ నేతల ఫొటోలతో ప్రొద్దుటూరు ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డితో పాటూ వైఎస్ వివేకా ఫోటో కూడా ఉంది.
కొంతకాలంగా వైఎస్సార్సీపీ వైఎస్ సునీతారెడ్డిపై ఆరోపణలు చేసింది. ఆమె టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారంటూ కొందరు నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పోస్టర్లు కలకలంరేపాయి. అయితే ఈ పోస్టర్లు ఎవరు అంటించారన్నది క్లారిటీ లేదు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఈ పోస్టర్లను అంటించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు ఈ పోస్టర్లు వ్యవహారంపైన ఆరా తీస్తున్నారట. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు.