బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బెంగళూరు సిటీలో ట్రాఫిక్‌పై సోషల్ మీడియాలో తరచూ మీమ్స్ పేలుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ బస్సు డ్రైవర్ చేసిన పనికి.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ట్రాఫిక్‌లో బస్సు నిలిచిపోగా.. డ్రైవర్ తన సీటులో కూర్చొని భోజనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ఈ వీడియోను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్ట్‌ను ఆన్లైన్లో షేర్ చేయగా.. కొద్ది గంటల్లోనే 15 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కొంత మంది బస్ డ్రైవర్ పట్ల సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు భరించలేమని కామెంట్ చేశారు. అడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని కొందరు దుయ్యబట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులతో బస్సు డ్రైవర్ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు కూడా సమయం లేదని ఒక నెటిజన్ అన్నారు. తాను ఆఫీస్‌కు వెళ్తూనే బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సి వచ్చిందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఐటీ సంస్ధలకు అడ్డాగా మారిన బెంగళూరు త్వరలో ట్రాఫిక్ జామ్‌ల సిటీగా మారుతుందని నగరవాసులు ఎద్దేవా చేస్తున్నారు. బెంగళూరు నగరంలో నివసించే వారు ఆఫీసులకు వెళ్లాలంటే ఇంట్లో నుంచి రెండు, మూడు గంటలు ముందుగానే బయలుదేరాల్సిన పరిస్ధితి నెలకొందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ర్యాపిడో బైక్‌పై వెళ్తూనే ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియో బయటికి వచ్చింది. దీంతో బెంగళూరు వాసుల కష్టాలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.