తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మరోమారు ప్రజలను మోసపూరిత హామీలతో మాయ చేస్తున్నారని, వాళ్ళు చేస్తున్నది మహానాడు కాదు.. మాయలనాడు అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కేక్ కటింగ్, వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి నేటి వరుకు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ లతో ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకురావడమే కాకుండా ఎలాంటి అవినీతి కి తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే నగదును జమ చేస్తున్నారన్నారు.