కృష్ణ జిల్లా, అంబాపురంలోని నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి తనపై ఆత్యాచారం చేసినట్లు కాలేజీలో చదివిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన విద్యార్థిని(23) కొత్తపేట పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. 2017 నుంచి 2020 వరకు చదివానని, హాజరుపట్టీ రోజూ ప్రిన్సిపాల్ రూమ్‌కు తీసుకువెళ్లేదానినని, 2019 జూన్ మొదటివారంలో తన రూమ్‌కు పిలిపించుకుని, తలుపులు మూసి బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. బయటకు చెబితే సర్టిఫికెట్లు ఇవ్వనని బెదిరించాడని, గర్భం రావడంతో మందులు వేయించి తీసివేయించాడని ఆరోపించింది. తర్వాత ఆగస్టులో మరోసారి అత్యాచారం చేశారని, మరో విద్యార్థిని ఉండడంతో అతనితో గొడవపడి బయటకు వచ్చేశానని తెలిపింది. అనంతర పరిణామంలో తనకు వివాహమైంది, రవీంద్రారెడ్డి అసభ్యకరంగా వాట్సాప్ మెస్సేజ్‌లు పంపాడని పేర్కొంది. ఇది చూసిన తన భర్త అతని వద్దకు వెళ్లి గొడవపడ్డాడని తెలిపింది. మూడు రోజుల క్రితం ఇంకొక యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలియడంతో తానుకూడా బాధితురాలేనని ఫిర్యాదు చేశానని పేర్కొంది. కొత్తపేట పోలీసులు అతనిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్సీ, అట్రాసిటీ, పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.