షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని ఔటేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. షర్మిల అన్న వదలిన బాణం కాదు.. అన్న వదిలేసిన బాణం. ఆ బాణమే రాబోయే రోజుల్లో ఏపీకి రాబోతోంది అని ఆయన సెటైర్లు వేశారు. వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆదినారాయణ రెడ్డి పై విధంగా స్పందించారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతారని స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. జగన్ రెడ్డి పోలవరానికి పొగపెట్టి.. అమరావతికి అగ్గిపెట్టారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఏపీకి 35 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం 35 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఏంటో సెప్టెంబర్ తర్వాత తెలుస్తుందని చెప్పారు.