చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో పెను ప్రమాదం తప్పింది. యాదమరి మండలం పట్రపల్లి వద్ద గుడియాతం రహదారిలో ఓ ఆయిల్ ట్యాంకర్ నడిరోడ్డులో కూరుకుపోయింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి రోడ్డుపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అదే మార్గంలో వెళ్లే పాఠశాలల వాహనాలు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో విద్యార్థులు, ఇతర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో పాఠశాలలకు, ఆఫీస్‌లకు ఆలస్యమవుతోందని విద్యార్థులు, ప్రయాణికులు వాపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డులో కూరుకుపోయిన ఆయిల్ ట్యాంకర్‌ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.